Thursday, 26 May 2016

మిశ్రమ ఎరువులు (MIXED FERTILIZERS)

మిశ్రమ ఎరువులు
   (MIXED FERTILIZERS)
      ఎక్కువ పరిమాణం లో కావలసిన నిష్పత్తిలో వివిధ రకాల సూటి ఎరువులు (ఉదా: యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, సున్నము వంటివి ) భౌతికం గా మిళితం (mixing ) చేయడం ద్వారా తయారయ్యే ఎరువులను మిశ్రమ ఎరువులు (bulk blended Fertilizers) అంటారు.
·         ఈ మిశ్రమ ఎరువులలో ముడి పదార్ధములను మిశ్రమం లో గుర్తించవచ్చును. పంట అవసరం మేరకు ఈ మిశ్రమము లను తయారు చేస్తారు. ఈ ఎరువులలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి.
·         మిశ్రమ ఎరువులను రైతు స్థాయిలో కొద్ది పరిమాణము లో తయారు చేసుకొనవచ్చును.
·         చిన్న పరిశ్రమలు ఎక్కువ పరిమాణములో తయారు చేసి ఎక్కువ మంది రైతులకు అందించవచ్చు.
రైతు స్థాయి మిశ్రమ ఎరువులు (Farm Mixtures)
  • ఏ రసాయనిక ఎరువులు కలపాలో అవి పొరలు పొరలు గా పోసుకొని, బాగా కలియు నట్లు పారలతో కలపాలి.
  • ఈ మిశ్రమాలను పంటకు వేయ బోయే రోజునే కలుపు కోవాలి. నిల్వ యున్నచో గడ్డ కట్టవచ్చు లేదా విష పదార్ధం గా మారవచ్చు.

యాంత్రిక మిశ్రమాలు:
  • ఎక్కువ మోతాదులలో వివిధ ఎరువులను యంత్రముల సహాయంతో కలపగా వచ్చే ఎరువులు యాంత్రిక మిశ్రమాలు
  • ఈ పద్ధతిలో ఎరువుల మధ్య రసాయనిక చర్య జరగకుండా వుండే వాటినే ఎంపిక చేసుకోవాలి.
  • ఆమ్ల లక్షణము కలిగి యున్న ఎరువులను క్షార స్వభావము కలిగిన ఎరువులతో కలపరాదు .ఉదా:అమ్మోనియం సల్ఫేట్ తో క్షార స్లాగ్ కలపరాదు .
  • ఎక్కువ తేమ శాతం కలిగిన ఎరువులు లేదా తేమను పీల్చుకొనే లక్షణం కలిగిన ఎరువులు వాడరాదు ఉదా: అమ్మోనియం నైట్రేట్, యూరియా
  • మిశ్రమ ఎరువులు ముద్ద కాకుండా చూసు కోవాలి. గుల్లగా ఉండడానికి పొడి చేసిన మొక్కజొన్న కండెలు లేదా కోకో చిప్పలు కలపాలి.
  • గడ్డ కట్టకుండా (caking)ఉండేందుకు తక్కువ స్థూల సాంద్రత గల పాటి మట్టిని లేదా సిలికా వంటి పదార్ధాలు కలపాలి.
  • ఒక నిష్పత్తి లో పోషకాల నిమిత్తం వివిధ ఎరువులు వాడేటప్పుడు నేల ఆరోగ్య రక్షణ కొరకు కేవలం రసాయన ఎరువులే కాక సేంద్రియ ఎరువులయినటు వంటి నూనె పిండి పదార్ధాలు (oil cakes) వాడవలెను.
  • అనుకొన్న మిశ్రమ పరిమాణము కొరకు ఫిల్లర్ పదార్ధాలు అయిన ఇసుక, మట్టి, బొగ్గు, బూడిద, సున్నం వాడవలెను.
  • నేల పునరుద్ధరణ (soil amelioration) దృష్టి లో పెట్టుకొని కొన్ని రసాయనాలు అంటే జిప్సం, సున్నం వంటివి కూడా కలుపుకునే అవకాశం ఉంది.

మిశ్రమ ఎరువుల తయారీకి మూల పదార్ధాల పరిమాణం లెక్కకట్టుట


మిశ్రమ ఎరువుల తయారీకి మూల పదార్ధాల పరిమాణము  లెక్కగట్టుట :
(calculation for preparation of mixed fertilizers)

ఉదా: ఒక టన్ను మిశ్రమ ఎరువు 10-6-4 (N-P-K) పోషక నమూనా (fertilizer grade) తో తయారు చేయుటకు కావలసిన అమ్మోనియం సల్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు ఇతర ఫిల్లర్ పదార్ధం ఎంత?
  • కావలసిన మిశ్రమ పరిమాణం                     :           1 టన్ను = 1000 కిలోలు
  • అమ్మోనియం సల్ఫేట్ లో నత్రజని శాతం       :           20.5
  • సూపర్ ఫాస్పేట్ లో భాస్వర శాతం               :           16.0
  • మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లో పొటాష్ శాతం       :           60.0
  • Fertilizer grade                                   :           10-6-4 (N-P-K)

   కావలసిన పోషక శాతము
టన్ను మిశ్రమ ఎరువుకు కావలసిన ఎరువు       = ------------------------------------------------ x 1000
                                                                        వాడే ఎరువు లో ఉన్న పోషక శాతము

అమ్మోనియం సల్ఫేట్                   =          10 /20.5 x 1000           =          487.8 Kg
సూపర్ ఫాస్పేట్                           =          6 / 16 x 1000               =          375    Kg
మ్యూరేట్ ఆఫ్ పొటాష్                   =          4 / 60 x 1000               =          66.7   Kg

మొత్తం రసాయనిక ఎరువుల పరిమాణం   =487.8 + 375 + 66.7  = 929.5 Kg
కావలసిన మిశ్రమ ఎరువు పరిమాణం           = 1000 Kg
కలపవలసిన ఫిల్లర్ పదార్ధం                        = 1000  929.5 = 70.5 Kg


ఉదా:2
ఒక టన్ను మిశ్రమ ఎరువు 6-4-3 (N-P-K) పోషక నమూనా (fertilizer grade) తో తయారు చేయుటకు కావలసిన వివిధ రకాల ఎరువుల పరిమాణం ఎంత?
ఈ మిశ్రమ ఎరువులో నత్రజని నిమిత్తం 1:2 నిష్పత్తి లో వేపపిండి, యూరియా వాడవలసి వుంది.
భాస్వరం నిమిత్తం బేసిక్ స్లాగ్ మరియు సింగిల్ సూపర్ ఫాస్పేట్ 1:3 నిష్పత్తి లో వాడవలసి ఉంది
పొటాష్ ఎరువు గా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడవలెను.

పోషక నమూనా = 6-4-3 (N-P-K)
నత్రజని:
పోషక నమూనా లో నత్రజని శాతం                                       = 6
వేపపిండి రూపం లో సరఫరా చేయవలసిన నత్రజని శాతం         = 6 x 1 / 3        = 2
యూరియా రూపం లో సరఫరా చేయవలసిన నత్రజని శాతం      = 4
వేపపిండి పరిమాణం                                                         = 2 / 5 x 1000 = 400 Kg               
(వేపపిండి లో నత్రజని శాతం = 5 )
యూరియా పరిమాణం                                                      = 4 / 46 x 1000 = 87 Kg

భాస్వరం:
పోషక నమూనాలో భాస్వర శాతం                                        = 4
క్షార స్లాగ్ రూపం లో సరఫరా చేయవలసిన భాస్వర శాతం         = 1
సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపం లో సరఫరా చేయవలసిన  భాస్వర శాతం = 3

క్షార స్లాగ్ పరిమాణం = 1 / 18 x 1000 =55.5 Kg (క్షార స్లాగ్ లో భాస్వర శాతం =18)
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్  పరిమాణం                         = 3 /16 x 1000             = 187.5 Kg

పొటాష్:
పోషక నమూనా లో పొటాష్ శాతం               = 3
సల్ఫేట్ ఆఫ్ పొటాష్ పరిమాణం                  = 3 / 50 x 1000                        = 60 Kg
(SOP లో  K శాతం  50 )
మొత్తం ఎరువుల పరిమాణం:
వేపపిండి                                                = 400 Kg
యూరియా                                             =   87 Kg
క్షార స్లాగ్                                                = 55.5 Kg
సింగిల్ సూపర్ ఫాస్పేట్                             = 187.5 Kg
సల్ఫేట్ ఆఫ్ పొటాష్                                 = 60 Kg

మొత్తం ఎరువుల పరిమాణం                       = 790 Kg
కలపవలసిన ఫిల్లర్                                   = 1000  790 = 210 Kg

సంకీర్ణ ఎరువులు: COMPLEX FERTILIZERS

సంకీర్ణ  ఎరువులు:
COMPLEX FERTILIZERS
  • సంకీర్ణ రసాయనిక ఎరువులలో రెండు లేక మూడు ప్రధాన పోషకాలు రసాయనం గా కలిసిన రూపం లో వుంటాయి.
  • పోషక పదార్ధాలు ఎక్కువ శాతం లో వుంటాయి. అందువలన సూటి ఎరువులతో పోల్చి చూస్తే ప్యాకింగ్, గోదాము, రవాణా ఖర్చులు చాలా తక్కువ.
  • సాధారణం గా గుళికల రూపం లో ఎన్నో మంచి భౌతిక లక్షణాలు వుంటాయి. కనుక కావలసినంత మేరకే పొలం లో చల్లు కోవడానికి వీలవుతుంది.
  • పోషక పదార్ధాలన్నీ ప్రతి మొక్కకు సమానం గా అందుతాయి.
  • తేమను తొందరగా పీల్చు కోవు, చల్లడం సులువు.
  • సంకీర్ణ ఎరువులు మూడు రకాలు- 1. అమ్మోనియం ఫాస్పేట్లు, 2. నైట్రోఫాస్పేట్లు , 3. న-భా-పొ సంకీర్ణ ఎరువులు
  • సంకీర్ణ ఎరువులలో నత్రజని తో బాటు, భాస్వరం ఒకేసారి మొక్కలకు అందడం వల్ల పైర్ల కెంతో మేలు జరుగుతుంది.
  • కొన్ని పైర్లకు నత్రజని కంటే భాస్వరం అధికం గా కావలసి వస్తుంది. (పప్పుజాతి పంటలు) . అపుడు DAP ఎంతో బాగా పనిచేస్తుంది
  • DAP క్షార నేలలో, సున్నపు నేలల్లో బాగా పని చేస్తుంది.
  • న-భా-పొ సంకీర్ణ రసాయన ఎరువులు మార్కెట్ లో చాలా ఉన్నాయి.
  • ఉదా:     10-26-26
12-32-16
14-35-14
14-28-14
17-17-17
19-19-19

జీవన ఎరువులు Bio Fertilizers

జీవన ఎరువులు
Bio Fertilizers
  • నేల సజీవమన్నది వాస్తవం. దానిని గుర్తెరగడం మన కర్తవ్యం .
  • నేలలో మనకు కనిపించే జీవరాశు లే కాకుండా , కనిపించని కోటానుకోట్ల సూక్ష్మ జీవులు నేలలో జరిగే  భౌతిక, రసాయనిక జీవ సంబంధ చర్యలకు  మూల కారకాలు.
  • ఈ సూక్ష్మ జీవుల సంరక్షణ మన ప్రథమ కర్తవ్యం. అపుడే సమస్త జీవ రాశులకు రక్షణ కలుగుతుంది. ఇదే ప్రకృతి మనకు నిత్యం బోధించే పాఠ్యాంశం.
  • హరిత విప్లవం లో అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువుల పాత్ర మరవరానిది. కాని గ్రామాలలో సేంద్రియ పదార్ధ కొరత, అత్యధిక రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేల కాలుష్యానికి గురయి వ్యవసాయ యోగ్యం కాని క్షేత్రాలు గా మారి పోతున్నాయి.
  • ఈ సందర్భం లో జీవన ఎరువుల ప్రాధాన్యం పెరిగింది.
  • ప్రకృతిలో ఉండే పోషకాలను సూక్ష్మ జీవుల ద్వారా మొక్కలకు అందించే సేంద్రియ తయారీలను జీవన ఎరువులు అంటారు.

జీవన ఎరువుల వర్గీకరణ:
    1. గాలిలో నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు
    2. భాస్వరాన్ని కరిగించి లభ్యతను పెంచే జీవన ఎరువులు

1. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు:
a)      పరస్పర జీవనం తో నత్రజని ని స్తిరీకరించునవి (symbiosis)
b)      సహచర్యం తో నత్రజని స్తిరీకరించునవి (Associative)
c)      స్వతంత్ర జీవనం గడుపుతూ నత్రజనిని స్థిరీకరించునవి(free living)
2.భాస్వర లభ్యతను పెంచే జీవన ఎరువులు:
a)      భాస్వరాన్ని కరిగించేవి
b)      భాస్వరాన్ని అందించేవి.

1. నత్రజని ని స్థిరీకరించు జీవన ఎరువులు: (Atmospheric Nitrogen fixers)

Ø  గాలిలో నత్రజని 78% ఉంది. అంటే యూరియాలో ఉండే నత్రజని కంటే 1 ½ రెట్లు ఎక్కువ. నత్రజని వాయు రూపంలో ఉంటుంది. కొన్ని సూక్ష్మ జీవులు మాత్రమె దీనిని మొక్కలకు ఉపయోగించే రూపం లోనికి మార్చగలవు. తద్వారా నేలకు నత్రజని అందుతుంది.
Ø  నత్రజని స్థిరీకరణ జీవ సంబంధ రసాయనిక క్రియ. ఈ ప్రక్రియలో వాయు రూపంలో ఉన్న నత్రజని (N2) సూక్ష్మ జీవులలో ఉన్న నైట్రోజినేజ్   ( Nitrogenase ) అనే ఎంజైమ్ ద్వారా క్షయ కరణం  చెంది అమ్మోనియా గా మారుతుంది.
Ø  అమ్మోనియా రూపం లో ఉన్న ఈ నత్రజనిని మొక్కలు ఉపయోగించుకుంటాయి.
నత్రజని స్థిరీకరణకు దోహదపడే అంశాలు:
Ø  వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడం
Ø  నేలలు స్వల్ప క్షర లక్షణాలు కలిగి ఉండడం
Ø  భాస్వరం, కాల్షియం, గంధకం, ఇనుము, మాలిబ్డినం వంటి పోషకాల లభ్యత సమృద్ధి గా ఉండడం.
నత్రజని స్థిరీకరణ లో రకాలు:
a)      పరస్పర సహజీవనం తో నత్రజని స్థిరీకరణ (symbiotic N-fixers)
తమ ఆహార అవసరాలను మొక్కల నుండి సంగ్రహిస్తూ, సూక్ష్మ జీవులు గాలిలోని నత్రజనిని స్థిరీకరించుతాయి. ముఖ్యం గా ఇది పప్పు జాతి పంటలలో జరుగు తుంది.


బాక్టీరియా:
రైజోబియం:               లెగ్యూమినేసి కుటుంబ మొక్కలు   - వేర్ల బొడిపెలపై ఉండును
ఎజో రైజోబియం కాలిడాన్స్ : జీలుగ జాతి మొక్కల కాండము పై బుడిపెలు ఉండును.

ఎక్టినో మైసిట్స్;
ఫ్రాంకియా                       : సరుగుడు మొక్కలు
ఆల్గే :
అనబీనా
అజోల్లా  నత్రజని మొక్కలో వుండును. వరిలో దీనిని హరిత ఎరువు గా వాడుతారు.
పప్పుజాతి పంటలు  బాక్టీరియా రకాలు:
ఒక్కొక్క పప్పు జాతి పంటకు ఒక్కొక్క బాక్టీరియా వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. ఉదాహరణకు
రైజోబియం పేరు                                                               పప్పు జాతి మొక్క
రైజోబియం మెలిలాటి                                                        బెర్సీం
రైజోబియం ట్రైఫోలి                                                            పిల్లి పెసర
రైజోబియం లెగ్యూమినోసారం                                              బఠాని, లాథిరస్
రైజోబియం ఫెసియోలి                                                        మినుము
రైజోబియం జపానికం                                                        సోయా చిక్కుడు
రైజోబియం (cowpea group)                                           అలసంద

రైజోబియం ముఖ్యం గా పప్పు దినుసులు (పెసర, మినుము, కంది) నూనె గింజలు ( వేరుశెనగ, సోయాచిక్కుడు) పంటలకు ఉపయోగ పడుతుంది. ఇది మొక్కల వేళ్ళ బుడిపెలలో ఉండి గాలి లోని నత్రజనిని గ్రహించి మొక్కలకు అందజేస్తుంది. ఎకరాకు 20 కిలోల వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. 25 -30 % దిగుబడులు పెరుగుతాయి.

వాడే విధానం: ఒక లీటరు నీటికి 50 గ్రాముల బెల్లం లేదా పంచదార కరిగించి 15 నిముషములు మరగించి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ద్రావణానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను కలపాలి. ఈ విధం గా చేసిన దానిని ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి పట్టించి, నీడలో ఆరబెట్టి తరువాత విత్తుకోవాలి.


b)      సహచర్యం తో నత్రజని స్థిరీకరించు జీవన ఎరువులు:
ఎజో స్పైరిల్లం:
ü  ఈ జీవులు ఆరు తడి, మెట్ట  పంటలలో మొక్కల వేళ్ళ మీద జీవిస్తూ నత్రజనిని స్థిరీకరిస్తాయి.
ü  రైజోబియం వలె వేళ్ళ మీద బుడిపెలు ఏర్పడవు.
c)      స్వతంత్రం గా జీవిస్తూ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు (free living)
ఎజటో బాక్టర్:
గాలి ప్రసరణ బాగున్న నేలల్లో మరియు సేంద్రియ నిల్వలు  ఎక్కువగా ఉన్న నేలల్లో నత్రజని స్థిరీకరిస్తుంది.
ఈ జీవన ఎరువు మొక్కలపై ఆధారపడకుండా , స్వతంత్రం గా నేలలో నివసిస్తూ గాలిలో వున్న నత్రజనిని గ్రహించి మొక్కలకు అందజేస్తుంది. ఇది వరి, చెరకు, అరటి, ప్రత్తి, మిరప, కొబ్బరి పంటలకు ఉపయోగం.
వాడే విధానం: దీనిని విట్ట్గన శుద్ధి ద్వారా అయితే 20 గ్రాములు లేకుంటే  1-2 కిలోల కల్చర్ 20 కిలోల పశువుల ఎరువు తో కలిపి ఒక ఎకరానికి వేయవచ్చు.

క్లాస్ట్రీడియం: నీరు నిల్వ యుండి ఆక్సిజన్ అతి తక్కువ గా ఉండే వరి పొలాల్లో నత్రజనిని స్తిరీకరిస్తుంది.
నీలి ఆకు పచ్చ నాచు: (blue green algae)
స్వతంత్రం గా నీటిపై తేలియాడుతూ నత్రజనిని స్థిరీకరించే ఆల్గే. ఇది వరి పైరుకు బాగా ఉపయోగపడుతుంది. నాలుగు కిలోల నాచు పొడిని వరి నాటిన వారం పడి రోజుల్లో ఒక ఎకరం పొలం లో చల్లాలి. చల్లిన తర్వాత ఒక వారం వరకు మడిలో తగినంత నీరు ఉండేటట్లు చూడాలి. దీని వాడకం వలన ఎకరానికి 8-12 కిలోల నత్రజని ని ఆదా చేయవచ్చు. 10-12 శాతం వరకు దిగుబడులు పెరుగుతాయి.
తయారు చేయు విధం:
నీలి ఆకు పచ్చ నాచు ని రైతులు వారి పొలాల్లో స్వయం గా తయారు చేసుకోవచ్చు పొలం లో 10 మీ వెడల్పు ఉండేటట్లు తయారు చేయాలి. మడి చుట్టూ ఆరు అంగుళాల ఎత్తు లో గట్టు వేయాలి. దీనిలో తగినంత నీరు పెట్టి దమ్ము చేయాలి.దమ్ము చేసిన తర్వాత మడిలో ఒక అంగుళం నీరు నిల్వ ఉండాలి. దీనిలో 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ , 5  కిలోల నాచు పొడిని చల్లాలి. నాచు ని తినే దోమలు, నత్తలు, ఇతర పురుగులు అభివృద్ధి చెందకుండా కార్బోఫ్యురాన్ గుళికలు 250 గ్రాములు మడిలో చల్లాలి. నాచు 3-4 వారాల్లో తయారవుతుంది. దట్టం గా పెరిగిన నాచుని నీటి నుండి తీసి ఆరబెట్టాలి. ముందుగా ఆరు బైట గాని ప్లాస్టిక్ షీట్స్ పైన గాని మట్టిని చల్లి దాని పై నీలి ఆకు పచ్చ నాచు చల్లాలి నాచు బాగా ఆరిన తర్వాత తీసి ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేసుకోవచ్చు.
నాచును మడి నుండి తీసిన తర్వాత అదే  మడిలో నీరు పెట్టి సింగిల్ సూపర్ ఫాస్పేట్, కార్బోఫ్యురాన్ గుళికలు వేసి ప్రతీ 20 రోజుల కు ఒకసారి నీలి ఆకు పచ్చ నాచుని తయారు చేసుకోవచ్చు.

భాస్వర లభ్యత పెంచే జీవన ఎరువులు :
ఈ జీవులు లభ్యం కాని రూపం లో వున్న భాస్వరమును లభ్య రూపం లోనికి మారుస్తాయి. అంతే కాక వేరు ఉపరితలాన్ని పెంచి భాస్వరాన్ని మొక్కకు అందజేస్తాయి.
భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా – బాసిల్లస్ (Bacillus megatherium)
                                    సూడోమోనాస్ (Psedomonas straiata)
భాస్వరాన్ని కరిగించే శిలీంద్రాలు – ఎస్పర్జిల్లస్(Aspergillus awamori)
                                    పెన్సీలియం(Pencikkium bilaji)
భాస్వరాన్ని పట్టి అందించే శిలీంద్రాలు: VAM fungi
VAM :Vasicular Arbiscular Micorrhiza)
వాడే విధానం: ఒక ఎకరా అవసరమైన విత్తనానికి 200 గ్రాముల కల్చర్ కలిపి వాడవచ్చు. లేకుంటే 1-2 కిలోల కల్చర్ ను 20 కిలోల పశువుల ఎరువు తో కలిపి ఒక  ఎకరం పొలం లో దుక్కి సమయం లో వాడాలి.

జీవన ఎరువుల వాడకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు:
  • లిగ్నైట్ (lignite), పీట్ (peat),  బొగ్గు పొడి మరియు ఇతర పదార్ధాలను జీవన ఎరువుల తయారీ లో carrier material  గా వాడుతారు. జీవన ఎరువులలో నిర్దిష్ట సంఖ్యలో కావలసిన బాక్టీరియా ఇతర సూక్ష్మ జీవులను ఉండేటట్లు చూడాలి.
  • జీవన ఎరువులను చల్లని ప్రదేశాలలో నిల్వ ఉంచుకోవాలి.
  • జీవన ఎరువులు సేంద్రియ ఎరువుల తో కలుపుకుని వాడడం శ్రేయస్కరం.
  • సేంద్రియ నిల్వలు లేని నేలల్లో జీవన ఎరువులనుండి ఆశించిన ఫలితాలు రావు.
  • రసాయనిక ఎరువుల వాడకం జీవన ఎరువుల సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి.
  • నేలలో సూటిగా వేసుకోవచ్చు. విత్తన శుద్ధి ద్వారా గాని, కొన్ని పరిస్థితులలో పిచికారీ ద్వారా గాని జీవన ఎరువులను వాడుకోవచ్చు.

జీవన ఎరువుల వలన లాభాలు:
  • వాతావరణం లోని నత్రజనిని స్థిరీకరించి నేలలో నత్రజనిని చేకూర్చుతాయి.
  • నేలలో యున్న భాస్వరాన్ని కరిగించి లభ్య రూపం లోనికి మారుస్తాయి. అంతే గాక మొక్కలకు అందుబాటు లోకి తెస్తాయి.
  • మొక్క పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్లు, ఎంజైములు, హార్మోనులు మొక్కలకు అందిస్తాయి.
  • 20-25 శాతం వరకు నత్రజని, భాస్వరం ఎరువుల వాడకం తగ్గించవచ్చు.
  • ఎరువుల కు అయ్యే ఖర్చు తగ్గుతుంది.
  • దిగుబడులు 10-20 శాతం వరకు పెరుగు తాయి.
  • భూసారం పెరుగుతుంది.
  • నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళను కొంత వరకు నివారించ వచ్చు.
  • సూక్ష్మ పోషకాల వినియోగానికి దోహద పడతాయి.
  • నేల, వాతావరణ కాలుష్యం నివారించ వచ్చు
  • పంట నాణ్యత, రుచి పెరుగుతుంది.
జీవన ఎరువులు లభ్యమయ్యే ప్రదేశాలు:
1)      వ్యవసాయ పరిశోధనా కేంద్రం, గరిక పాడు, కృష్ణా జిల్లా
2)      వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అమరావతి, గుంటూరు జిల్లా
3)      కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, రాజమండ్రి
4)      డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, రీజినల్ సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీ, రాజేంద్ర నగర్ , హైదరాబాద్.

Wednesday, 25 May 2016

సమగ్ర సస్య పోషణ (Integrated Nutrient Management)

సమగ్ర సస్య పోషణ
(Integrated Nutrient Management)
  • మన పూర్వీకులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యాన్ని, సారాన్ని పరిరక్షించి నాణ్యమైన దిగుబడులు సాధించారు.
  • భారతదేశ జనాభా పెరుగుదల – వారి ఆహార అవసరాల నిమిత్తం-శాస్త్రవేత్తల కృషి ఫలితం గా తక్కువ కాలం లో ఎక్కువ దిగుబడినిచ్చే సంకర రకాల ఆవిర్భావం – దానితో బాటు ఎక్కువ పోషకాలు గల రసాయనిక ఎరువులు వాడకం తో మంచి దిగుబడులు సాధించాము.
  • రైతులు విచక్షణా రహితం గా రసాయన ఎరువు వాడడం ప్రారంభించడం మొదలు పెట్టారు.
  • ఆర్ధిక, సామాజిక మార్పుల వలన రైతులు పశుపోషణ, సేంద్రియ వ్యర్ధాల సమీకరణ తగ్గడం వలన వ్యవసాయం పూర్తిగా రసాయనిక ఎరువులు, కీటక నాసిను లపై ఆధార పాడడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి వ్యవసాయానికి పెను ముప్పు ఏర్పడే పరిస్థితి ఉద్బవించింది..
  • ప్రస్తుత పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని భూసార పరిరక్షణకు శాస్త్రజ్ఞులు, అనుభవం గల రైతులు కృషి చేసి తత్ఫలితం గా “సమగ్ర సస్య పోషణ” అనే విధానాన్ని ప్రవేశపెట్టారు.
సమగ్ర సస్య పోషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం:
మొక్కకు కావలసిన వివిధ పోషకాలను సేంద్రియ మరియు రసాయనిక ఎరువులను తగు పాళ్ళలో వాడుకుని, పర్యావరణాన్ని పరి రక్షించు కుంటూ అధిక దిగుబడులు సాధించడమే సమగ్ర సస్య పోషణ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
సమగ్ర సస్య పోషణ లో పరిగణన లోనికి తీసుకొనే అంశాలు:
·         నేలలో పోషకాల పరిమాణ స్థాయి.
·         సేంద్రియ ఎరువుల ద్వారా అందే పోషకాలు
·         రసాయనిక ఎరువుల ద్వారా అందే పోషకాలు
·         నేల నుండి వృధా అయ్యే పోషకాలు
·         వేసే పంట పోషక అవసరాలు.
ముఖ్య ఉద్దేశ్యాలు: (Goals of INM)
  • నేల ఉత్పాదకత (soil productivity) పెంచడం
  • అనుకూల, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వ్యవసాయం లాభసాటి గా ఉండేటట్లు రూప కల్పన చేయడం
  • రసాయన ఎరువుల వాడకం మరియు వాటి ఖర్చు కొంత మేరకు తగ్గించడం
  • ప్రాంతీయం గా (locally) లభ్యమయ్యే సేంద్రియ వనరులను, పచ్చి రొట్ట ఎరువులను, జీవన ఎరువులను సమ్మర్ధవంతం గా వినియోగించుకోవడం
  • పర్యావరణ పరి రక్షణకు తోడ్పడడం
  • సహజ వనరులను నష్టపరచకుండా రైతుల ఆర్ధిక స్థితిని మెరుగు పరచడం.
సమగ్ర సస్య పోషణ లో భాగాలు:(Components of INM)
1)      సేంద్రియ ఎరువులు
2)      వ్యవసాయ వ్యర్ధాలు
3)      జీవన ఎరువులు
4)      రసాయనిక ఎరువులు
1). సేంద్రియ ఎరువులు :
పశువుల ఎరువు, కంపోష్టు, హరిత మొక్కల ఎరువు, హరిత ఆకుల ఎరువు వివిధ రకాల గాఢ సేంద్రియ ఎరువులు, (oil cakes), జంతు సంబంధిత సేంద్రియ ఎరువులు (బ్లడ్ మీల, బోన్ మీల, హార్న్ మీల్ మొదలైనవి)

2). వ్యవసాయ వ్యర్ధాలు:
వ్యవసాయ వ్యర్ధాలు-పంట కోసిన తర్వాత మిగిలిన మోళ్ళు, పశువుల మేతకు పనికి రాని వ్యర్ధాలు, చెరకు ఆకులు మొదలైనవి.

3). జీవన ఎరువులు:
రైజోబియం, ఎజటో బాక్టర్ , క్లాస్ట్రీడియం, ఎజో స్పైరిల్లం, ఎసిటో బాక్టర్  వంటి నత్రజని స్థిరీకరించు జీవులు, బెసిల్లాస్, సూడో మోనాస్ , ఎస్పర్జిల్లస్, పెన్సిలియం మొదలైన భాస్వరం కరిగించే సూక్ష్మ జీవులు

4). రసాయనిక ఎరువులు:
నత్రజని, భాస్వరపు, పొటాష్ మరియు సూక్ష్మ పోషక పదార్ధాలను అందించే రసాయనిక ఎరువులు

సమగ్ర సస్య పోషణ లో అవరోధాలు (constraints in INM)
  1. రైతు స్థాయిలో పశు పోషణ సన్న గిల్లి పశువుల ఎరువు లభ్యత లేకపోవడం
  2. పచ్చి రొట్ట ఎరువులకు సరైన ఆదరణ లేదు. దాని బదులు మరొక పంట పండించవచ్చు అన్న కారణం చే పచ్చి రొట్ట పైరుల ప్రాధాన్యత తగ్గింది.
  3. జీవన ఎరువులు అందు బాటులో లేకపోవడం మరియు వాటిపై సరైన అవగాహనా లేక పోవడం
  4. మట్టి పరీక్షలు దాని ఆధారిత సిఫారసు కార్యక్రమాలు లోప భూయిష్టం కావడం
  5. పెరిగి పోతున్న రసాయన ఎరువుల ఖరీదు
  6. సాగునీటి కొరత
  7. సమస్యాత్మక భూములు
  8. శాస్త్రీయ పరిజ్ఞానం, ఋణ సదుపాయం సక్రమంగా అందక పోవడం.

సమగ్ర సస్య పోషణ – లాభాలు:
  1. నేల సారం, ఉత్పాదకత పెరుగును
  2. నేల భౌతిక, రసాయన, జీవ పరమయిన లక్షణాలు మెరుగు పడతాయి
  3. నీరు ఇంకే గుణం (infiltration), నీరు నిల్వ ఉంచుకునే గుణం (water holding capacity), మురుగు నీరు పోవు సౌకర్యం (drainage) మెరుగు పడతాయి.
  4. పోషకాల లభ్య రూపం లోకి మారే ప్రక్రియ (mineralization), పోషకాలు వృధా కాకుండా నిల్వ ఉంచుకునే గుణం (ion exchange) పెరుగు తాయి.
  5. నేలలో వచ్చే మార్పులను నిరోధించే శక్తి (buffering capacity) పెరుగుతుంది.
  6. రసాయన ఎరువుల సామర్ధ్యం (fertilizer use efficiency) పెరుగుతుంది.
  7. రసాయన ఎరువుల మీద పెట్టుబడి 30 శాతం వరకూ తగ్గించ వచ్చు.
  8. నేల కాలుష్యం, భూ గర్భ జలాల కాలుష్యం తగ్గుతుంది.