జీవన ఎరువులు
Bio Fertilizers
- నేల సజీవమన్నది వాస్తవం. దానిని గుర్తెరగడం మన కర్తవ్యం .
- నేలలో మనకు కనిపించే జీవరాశు లే కాకుండా , కనిపించని కోటానుకోట్ల సూక్ష్మ జీవులు నేలలో జరిగే భౌతిక, రసాయనిక జీవ సంబంధ చర్యలకు మూల కారకాలు.
- ఈ సూక్ష్మ జీవుల సంరక్షణ మన ప్రథమ కర్తవ్యం. అపుడే సమస్త జీవ రాశులకు రక్షణ కలుగుతుంది. ఇదే ప్రకృతి మనకు నిత్యం బోధించే పాఠ్యాంశం.
- హరిత విప్లవం లో అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువుల పాత్ర మరవరానిది. కాని గ్రామాలలో సేంద్రియ పదార్ధ కొరత, అత్యధిక రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేల కాలుష్యానికి గురయి వ్యవసాయ యోగ్యం కాని క్షేత్రాలు గా మారి పోతున్నాయి.
- ఈ సందర్భం లో జీవన ఎరువుల ప్రాధాన్యం పెరిగింది.
- ప్రకృతిలో ఉండే పోషకాలను సూక్ష్మ జీవుల ద్వారా మొక్కలకు అందించే సేంద్రియ తయారీలను “జీవన ఎరువులు” అంటారు.
జీవన ఎరువుల వర్గీకరణ:
- గాలిలో నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు
- భాస్వరాన్ని కరిగించి లభ్యతను పెంచే జీవన ఎరువులు
1. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు:
a) పరస్పర జీవనం తో నత్రజని ని స్తిరీకరించునవి (symbiosis)
b) సహచర్యం తో నత్రజని స్తిరీకరించునవి (Associative)
c) స్వతంత్ర జీవనం గడుపుతూ నత్రజనిని స్థిరీకరించునవి(free living)
2.భాస్వర లభ్యతను పెంచే జీవన ఎరువులు:
a) భాస్వరాన్ని కరిగించేవి
b) భాస్వరాన్ని అందించేవి.
1. నత్రజని ని స్థిరీకరించు జీవన ఎరువులు: (Atmospheric Nitrogen fixers)
Ø గాలిలో నత్రజని 78% ఉంది. అంటే యూరియాలో ఉండే నత్రజని కంటే 1 ½ రెట్లు ఎక్కువ. నత్రజని వాయు రూపంలో ఉంటుంది. కొన్ని సూక్ష్మ జీవులు మాత్రమె దీనిని మొక్కలకు ఉపయోగించే రూపం లోనికి మార్చగలవు. తద్వారా నేలకు నత్రజని అందుతుంది.
Ø నత్రజని స్థిరీకరణ జీవ సంబంధ రసాయనిక క్రియ. ఈ ప్రక్రియలో వాయు రూపంలో ఉన్న నత్రజని (N2) సూక్ష్మ జీవులలో ఉన్న “నైట్రోజినేజ్” ( Nitrogenase ) అనే ఎంజైమ్ ద్వారా క్షయ కరణం చెంది అమ్మోనియా గా మారుతుంది.
Ø అమ్మోనియా రూపం లో ఉన్న ఈ నత్రజనిని మొక్కలు ఉపయోగించుకుంటాయి.
నత్రజని స్థిరీకరణకు దోహదపడే అంశాలు:
Ø వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడం
Ø నేలలు స్వల్ప క్షర లక్షణాలు కలిగి ఉండడం
Ø భాస్వరం, కాల్షియం, గంధకం, ఇనుము, మాలిబ్డినం వంటి పోషకాల లభ్యత సమృద్ధి గా ఉండడం.
నత్రజని స్థిరీకరణ లో రకాలు:
a) పరస్పర సహజీవనం తో నత్రజని స్థిరీకరణ (symbiotic N-fixers)
తమ ఆహార అవసరాలను మొక్కల నుండి సంగ్రహిస్తూ, సూక్ష్మ జీవులు గాలిలోని నత్రజనిని స్థిరీకరించుతాయి. ముఖ్యం గా ఇది పప్పు జాతి పంటలలో జరుగు తుంది.
బాక్టీరియా:
రైజోబియం: లెగ్యూమినేసి కుటుంబ మొక్కలు - వేర్ల బొడిపెలపై ఉండును
ఎజో రైజోబియం కాలిడాన్స్ : జీలుగ జాతి మొక్కల కాండము పై బుడిపెలు ఉండును.
ఎక్టినో మైసిట్స్;
ఫ్రాంకియా : సరుగుడు మొక్కలు
ఆల్గే :
అనబీనా
అజోల్లా – నత్రజని మొక్కలో వుండును. వరిలో దీనిని హరిత ఎరువు గా వాడుతారు.
పప్పుజాతి పంటలు – బాక్టీరియా రకాలు:
ఒక్కొక్క పప్పు జాతి పంటకు ఒక్కొక్క బాక్టీరియా వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. ఉదాహరణకు
రైజోబియం పేరు పప్పు జాతి మొక్క
రైజోబియం మెలిలాటి బెర్సీం
రైజోబియం ట్రైఫోలి పిల్లి పెసర
రైజోబియం లెగ్యూమినోసారం బఠాని, లాథిరస్
రైజోబియం ఫెసియోలి మినుము
రైజోబియం జపానికం సోయా చిక్కుడు
రైజోబియం (cowpea group) అలసంద
రైజోబియం ముఖ్యం గా పప్పు దినుసులు (పెసర, మినుము, కంది) నూనె గింజలు ( వేరుశెనగ, సోయాచిక్కుడు) పంటలకు ఉపయోగ పడుతుంది. ఇది మొక్కల వేళ్ళ బుడిపెలలో ఉండి గాలి లోని నత్రజనిని గ్రహించి మొక్కలకు అందజేస్తుంది. ఎకరాకు 20 కిలోల వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. 25 -30 % దిగుబడులు పెరుగుతాయి.
వాడే విధానం: ఒక లీటరు నీటికి 50 గ్రాముల బెల్లం లేదా పంచదార కరిగించి 15 నిముషములు మరగించి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ద్రావణానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను కలపాలి. ఈ విధం గా చేసిన దానిని ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి పట్టించి, నీడలో ఆరబెట్టి తరువాత విత్తుకోవాలి.
b) సహచర్యం తో నత్రజని స్థిరీకరించు జీవన ఎరువులు:
ఎజో స్పైరిల్లం:
ü ఈ జీవులు ఆరు తడి, మెట్ట పంటలలో మొక్కల వేళ్ళ మీద జీవిస్తూ నత్రజనిని స్థిరీకరిస్తాయి.
ü రైజోబియం వలె వేళ్ళ మీద బుడిపెలు ఏర్పడవు.
c) స్వతంత్రం గా జీవిస్తూ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు (free living)
ఎజటో బాక్టర్:
గాలి ప్రసరణ బాగున్న నేలల్లో మరియు సేంద్రియ నిల్వలు ఎక్కువగా ఉన్న నేలల్లో నత్రజని స్థిరీకరిస్తుంది.
ఈ జీవన ఎరువు మొక్కలపై ఆధారపడకుండా , స్వతంత్రం గా నేలలో నివసిస్తూ గాలిలో వున్న నత్రజనిని గ్రహించి మొక్కలకు అందజేస్తుంది. ఇది వరి, చెరకు, అరటి, ప్రత్తి, మిరప, కొబ్బరి పంటలకు ఉపయోగం.
వాడే విధానం: దీనిని విట్ట్గన శుద్ధి ద్వారా అయితే 20 గ్రాములు లేకుంటే 1-2 కిలోల కల్చర్ 20 కిలోల పశువుల ఎరువు తో కలిపి ఒక ఎకరానికి వేయవచ్చు.
క్లాస్ట్రీడియం: నీరు నిల్వ యుండి ఆక్సిజన్ అతి తక్కువ గా ఉండే వరి పొలాల్లో నత్రజనిని స్తిరీకరిస్తుంది.
నీలి ఆకు పచ్చ నాచు: (blue green algae)
స్వతంత్రం గా నీటిపై తేలియాడుతూ నత్రజనిని స్థిరీకరించే ఆల్గే. ఇది వరి పైరుకు బాగా ఉపయోగపడుతుంది. నాలుగు కిలోల నాచు పొడిని వరి నాటిన వారం పడి రోజుల్లో ఒక ఎకరం పొలం లో చల్లాలి. చల్లిన తర్వాత ఒక వారం వరకు మడిలో తగినంత నీరు ఉండేటట్లు చూడాలి. దీని వాడకం వలన ఎకరానికి 8-12 కిలోల నత్రజని ని ఆదా చేయవచ్చు. 10-12 శాతం వరకు దిగుబడులు పెరుగుతాయి.
తయారు చేయు విధం:
నీలి ఆకు పచ్చ నాచు ని రైతులు వారి పొలాల్లో స్వయం గా తయారు చేసుకోవచ్చు పొలం లో 10 మీ వెడల్పు ఉండేటట్లు తయారు చేయాలి. మడి చుట్టూ ఆరు అంగుళాల ఎత్తు లో గట్టు వేయాలి. దీనిలో తగినంత నీరు పెట్టి దమ్ము చేయాలి.దమ్ము చేసిన తర్వాత మడిలో ఒక అంగుళం నీరు నిల్వ ఉండాలి. దీనిలో 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ , 5 కిలోల నాచు పొడిని చల్లాలి. నాచు ని తినే దోమలు, నత్తలు, ఇతర పురుగులు అభివృద్ధి చెందకుండా కార్బోఫ్యురాన్ గుళికలు 250 గ్రాములు మడిలో చల్లాలి. నాచు 3-4 వారాల్లో తయారవుతుంది. దట్టం గా పెరిగిన నాచుని నీటి నుండి తీసి ఆరబెట్టాలి. ముందుగా ఆరు బైట గాని ప్లాస్టిక్ షీట్స్ పైన గాని మట్టిని చల్లి దాని పై నీలి ఆకు పచ్చ నాచు చల్లాలి నాచు బాగా ఆరిన తర్వాత తీసి ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేసుకోవచ్చు.
నాచును మడి నుండి తీసిన తర్వాత అదే మడిలో నీరు పెట్టి సింగిల్ సూపర్ ఫాస్పేట్, కార్బోఫ్యురాన్ గుళికలు వేసి ప్రతీ 20 రోజుల కు ఒకసారి నీలి ఆకు పచ్చ నాచుని తయారు చేసుకోవచ్చు.
భాస్వర లభ్యత పెంచే జీవన ఎరువులు :
ఈ జీవులు లభ్యం కాని రూపం లో వున్న భాస్వరమును లభ్య రూపం లోనికి మారుస్తాయి. అంతే కాక వేరు ఉపరితలాన్ని పెంచి భాస్వరాన్ని మొక్కకు అందజేస్తాయి.
భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా – బాసిల్లస్ (Bacillus megatherium)
సూడోమోనాస్ (Psedomonas straiata)
భాస్వరాన్ని కరిగించే శిలీంద్రాలు – ఎస్పర్జిల్లస్(Aspergillus awamori)
పెన్సీలియం(Pencikkium bilaji)
భాస్వరాన్ని పట్టి అందించే శిలీంద్రాలు: VAM fungi
VAM :Vasicular Arbiscular Micorrhiza)
వాడే విధానం: ఒక ఎకరా అవసరమైన విత్తనానికి 200 గ్రాముల కల్చర్ కలిపి వాడవచ్చు. లేకుంటే 1-2 కిలోల కల్చర్ ను 20 కిలోల పశువుల ఎరువు తో కలిపి ఒక ఎకరం పొలం లో దుక్కి సమయం లో వాడాలి.
జీవన ఎరువుల వాడకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు:
- లిగ్నైట్ (lignite), పీట్ (peat), బొగ్గు పొడి మరియు ఇతర పదార్ధాలను జీవన ఎరువుల తయారీ లో carrier material గా వాడుతారు. జీవన ఎరువులలో నిర్దిష్ట సంఖ్యలో కావలసిన బాక్టీరియా ఇతర సూక్ష్మ జీవులను ఉండేటట్లు చూడాలి.
- జీవన ఎరువులను చల్లని ప్రదేశాలలో నిల్వ ఉంచుకోవాలి.
- జీవన ఎరువులు సేంద్రియ ఎరువుల తో కలుపుకుని వాడడం శ్రేయస్కరం.
- సేంద్రియ నిల్వలు లేని నేలల్లో జీవన ఎరువులనుండి ఆశించిన ఫలితాలు రావు.
- రసాయనిక ఎరువుల వాడకం జీవన ఎరువుల సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి.
- నేలలో సూటిగా వేసుకోవచ్చు. విత్తన శుద్ధి ద్వారా గాని, కొన్ని పరిస్థితులలో పిచికారీ ద్వారా గాని జీవన ఎరువులను వాడుకోవచ్చు.
జీవన ఎరువుల వలన లాభాలు:
- వాతావరణం లోని నత్రజనిని స్థిరీకరించి నేలలో నత్రజనిని చేకూర్చుతాయి.
- నేలలో యున్న భాస్వరాన్ని కరిగించి లభ్య రూపం లోనికి మారుస్తాయి. అంతే గాక మొక్కలకు అందుబాటు లోకి తెస్తాయి.
- మొక్క పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్లు, ఎంజైములు, హార్మోనులు మొక్కలకు అందిస్తాయి.
- 20-25 శాతం వరకు నత్రజని, భాస్వరం ఎరువుల వాడకం తగ్గించవచ్చు.
- ఎరువుల కు అయ్యే ఖర్చు తగ్గుతుంది.
- దిగుబడులు 10-20 శాతం వరకు పెరుగు తాయి.
- భూసారం పెరుగుతుంది.
- నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళను కొంత వరకు నివారించ వచ్చు.
- సూక్ష్మ పోషకాల వినియోగానికి దోహద పడతాయి.
- నేల, వాతావరణ కాలుష్యం నివారించ వచ్చు
- పంట నాణ్యత, రుచి పెరుగుతుంది.
జీవన ఎరువులు లభ్యమయ్యే ప్రదేశాలు:
1) వ్యవసాయ పరిశోధనా కేంద్రం, గరిక పాడు, కృష్ణా జిల్లా
2) వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అమరావతి, గుంటూరు జిల్లా
3) కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, రాజమండ్రి
4) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, రీజినల్ సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీ, రాజేంద్ర నగర్ , హైదరాబాద్.
No comments:
Post a Comment