Tuesday, 28 June 2016

డ్రమ్ సీడర్ వరి సాగు - ప్రయోజనాలు

సాంప్రదాయ వరిసాగు కంటే మెరుగైన పద్ధతిగా శ్రీ సాగు మన రాష్ట్రంలో గత నాలుగైదేళ్ళుగా ప్రాచుర్యం పొందింది. తక్కువ నీరు, తక్కువ విత్తనం మరియు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే శ్రీ పద్దతిని ఎకరాకు 40 నుండి 50 బస్తాల దిగుబడిని సాధించి శ్రీ పద్దతిపై రైతులకు నమ్మకం పెంచింది.
ఏ పంట సాగుకైనా నానాటికీ కూలీల లభ్యత తీవ్రంగా ఉన్నది. గ్రామాల్లో ఒకే సారి పంట విత్తడమో, పంటలో కలుపుతీయడమో లేక పంటకోతలు జరిగితే కూలీల లభ్యత కష్టం అవ్వడమేగాక వారికి అదనపు కూలీ చెల్లించి, వారి కాళ్ళా వేళ్ళా పడి పని చేయించుకోవాల్సి వస్తోంది. 'శ్రీ పద్ధతి అధిక విస్తీర్ణంలో విస్తరించక పోవడానికి ఈ కూలీల సమస్యే ముఖ్య కారణం. ఇటువంటి తరుణంలో వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకెంతో ఊరటనిస్తుంది.
ఈ కోవకు చెందినదే వరిలో నేరుగా వరుసల్లో విత్తే పరికరం డ్రమ్ సీడర్, ఈ పరికరం మార్కెట్లో విడుదలయ్యి సంవత్సరాలు గడిచి వ్యవసాయ శాఖ వారు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా రైతులలో ఈ పరికరం మీద అవగాహన లేక వారి నుంచి స్పందన కరువైంది. ఈ పరికరంతో వరి సాగు చేయడం వలన కలిగే లాభాలను రైతులకు తెలియచేస్తున్నాము
డ్రమ్ సీడర్ నేరుగా వరిని విత్తే పద్ధతి
v ఒక ఎకరానికి 15 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పోయవలసిన అవసరం లేదు. సాధారణంగా వరిని మొలకెత్తించే ప్రక్రియనే పాటించాలి. ప్రధానపొలం బాగా దుక్కిదున్ని దమ్ముచేసి, చదును చేయాలి. డ్రమ్ సీడర్ పరికరంలోని నాలుగు డ్రమ్ములలో మొలకెత్తిన విత్తనాన్ని ఒక్కో డ్రమ్కు 3/4 వంతు మాత్రమే నింపాలి.
v డ్రమ్ నిండా విత్తనం నింపితే అవి డ్రమ్ నుండి సరిగా రాలవు. గింజ మొలక మరీ పొడవుగాకుండా చూసుకోవాలి. ఒక ఎకరాలో విత్తడానికి 3 కూలీలు అవసరం.
v డ్రమ్ సీడర్ను లాగడానికి ఒకరు, డ్రమ్ముల్లో గింజలు నింపడానికి ఇంకొకరు మరియు వారికి సహాయకుడిగా మూడవ వాడు అవసరం.
v ఒక ఎకరాలో విత్తడానికి కేవలం 120 నిమిషాలు (2 గంటలు) సమయం సరిపోతుంది. ఒకసారి డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో గింజలు విత్తబడతాయి.
v విత్తిన తర్వాత బూటాక్లోర్ కలుపుమందు ఖచ్చితంగా చల్లాలి, అవసరమైతే విత్తిన 30-40 రోజుల తర్వాత 2,4-డి సోడియం లవణాన్ని పిచికారీ చేయడం వలన కలుపు నిర్మూలించవచ్చు.
v శ్రీ పద్దతిలో లాగా, ఈ పద్దతిలోను కోనో వీడర్ ద్వారా కలుపు తొక్కించాలి. కాకాపోతే ఈ పద్ధతిలో కేవలం ఒకే దిక్కులో అంటే తూర్పు-పడమరగానీ, ఉత్తరం-దక్షిణం దిశలోకానీ కోనోవీడర్ను నడపాలి. ఈ పద్ధతికి అవసరమయ్యే కోనోవీడర్ యొక్క చక్రాలు 15 సెం.ల వెడల్పుతో ఉంటాయి, కావున శ్రీ పద్ధతిలోవాడే కోనోవీడర్లు(25 సెం.మీ. వెడల్పుగల చక్రాలు) పనికిరావు.
v కోనో వీడర్ను నడపడం వలన కలుపుమొక్కలు సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడడమే గాక, వరి యొక్క వేర్ల భాగం కదిలి మొక్కకు గాలి, నీరు, ఆహారం బాగా సమకూరి అధిక దిగుబడి సాధ్యమవుతుంది.
సాంప్రదాయ పద్ధతి, శ్రీ పద్ధతి మరియు నేరుగా విత్తే పద్ధతిలో ని వ్యత్యాసాలు
సాధారణ పద్ధతి
శ్రీ పద్ధతి
డ్రమ్ సీడర్ పద్ధతి
ఎకరాకు ౩౦-40 కిలోల విత్తనం అవసరం
ఎకరాకు 2 కిలోల విత్తనం అవసరం
ఎకరాకు 15 కిలోల విత్తనం అవసరం
నారు పోసి 25-౩౦ రోజుల వయసున్న నారును నాటాలి
నారు పోసి 8-12 రోజుల వయసున్న నారును నాటాలి
నారు పోయవలసిన అవసరం లేదు
నారుపోయుటకు, నారు మడికి ఖర్చు ఎక్కువ
నారుపోయుటకు, నారు మడికి ఖర్చు తక్కువ
ఎటువంటి ఖర్చు లేదు
నాటటానికి దాదాపు 15 కూలీలు అవసరం
నాటటానికి దాదాపు 10 కూలీలు అవసరం
విత్తడానికి 3 కూలీలు అవసరం
నాటేటపుడు ఎంత దూరం అనేది పాటించరు
25x25 సెం.మీ.దూరంలో కుదురుగా ఒక్కోమొక్కనే నాటాలి.
20 x 8 సెం.మీ.దూరంలో కుదురుగా 5 గింజలు పడతాయి
పొలం నాటినప్పటి నుండి 5 సెం.మీ. లోతు నీరు నిలువ ఉంచుతారు
నాటినప్పటి నుండి పొలాన్ని తడిగా మాత్రమే ఉంచి నీరు నిలువ ఉంచరాదు
విత్తి నప్పటి నుండి పొలాన్ని తడిగా మాత్రమే ఉంచి నీరు నిలువ ఉంచరాదు
కలుపు ను కూలీల తో తీయిస్తారు.కలుపు మందులను వాడతారు
రోటరీ వీడర్ను 4-5 సార్లు తిప్పి పోలములోని కలుపును తొక్కిస్తారు
కోనోవీడర్ ను ఉపయోగించి కలుపును మొలకెత్తిన 25 రోజుల నుండి 4 సార్లు నడిపి తీస్తారు.
దిగుబడి ఎకరాకు 30-40 బస్తాలు వస్తుంది
ఎకరాకు 45 బస్తాలు వస్తుంది
దిగుబడి ఎకరాకు 45 బస్తాలు వస్తుంది
నికరదాయం ఎకరాకు తక్కువ ఉంటుంది
నికరదాయం ఎకరాకు బాగానే ఉంటుంది
నికరదాయం ఎకరాకు ఎక్కువగా ఉంటుంది

డ్రమ్ సీడర్ తో నేరుగా వరిని విత్తిన పద్ధతిలో గల ప్రయోజనాలు:
ü నారు కోసం పొలం దున్నడం, దుక్కిచేయడం, నారు పోయడం, నారు పెరకడం, నారును ప్రధాన పొలం దగ్గరకు చేర్చడం మరియు నారు నాటడం వంటి సమస్యలు ఉండవు. నేరుగా మొలకెత్తిన వడ్లను ఒక ఎకరాలో ముగ్గురు నుండి నలుగురు కూలీలతో విత్తవచ్చును.
ü కలుపు మందును వాడడం వలన కలుపు సమస్య అధికంగా ఉన్న నేలల్లో కూడా రైతులు ఈ పద్దతిని నిర్ధయంగా పాటించవచ్చును. నేరుగా విత్తడం వలన రైతుకు కూలీల బెడద తగ్గి తద్వారా ఖర్చు తగ్గుతుంది
ü శ్రీ పద్ధతిలో రెండు దిక్కులలో అంటే తూర్పు పడమర మరియు ఉత్తరం దక్షిణం దిక్కులలో కోనోవీడర్ను నడపాలి. అందువలన కూలీల ఖర్చు అధికమవుతుంది. కానీ డ్రమ్ సీడర్ పద్దతిలో కేవలం ఒక దిక్కులో మాత్రమే కోనోవీడర్ను నడపగలం కావున కూలీల ఖర్చు మిగులుతుంది.


డాక్టర్.యన్.కృష్ణ ప్రియ, అగ్రి.పి.హెచ్.డి. వ్యవసాయ విస్తరణ విభాగం,

రీసెర్చ్ అసోసియేట్( పరిశోధన సహాయకురాలు)

No comments:

Post a Comment