Wednesday, 25 May 2016

సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం
(organic farming)
మన పూర్వీకులు వ్యవసాయానే వృత్తి గా నమ్ముకొని పశు సంపదను పెంచుకొని దాని ద్వారా వచ్చే సేంద్రియ పదార్ధాలను ఉపయోగించుకొని, భూసారాన్ని పెంచి వివిధ నాణ్యత గల పంటలను పండించేవారు.

అధిక దిగుబడి వంగడాలు, రసాయన ఎరువుల ప్రయోజనము వల్ల హరిత విప్లవం సాధించాము. కాలక్రమేణా రైతులు విచక్షణా రహితం గా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకం వల్ల నేల, నీరు, వాతావరణం కాలుష్యం చెంది పర్యావరణ సమతుల్యతను కోల్పోయాము. మానవాళికి తెలియని కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తి మనవ మనుగడకే పెరుముప్పు దాపురించింది.

ప్రస్తుతం శాస్త్రవేత్తలు, రైతాంగం, ప్రభుత్వాలు ఈ పెనుముప్పును ఏ విధం గా తప్పించి మానవాళి మనుగడకు సహాయ పడాలి అన్న దృక్పదం తో  మరల మన పూర్వ సాంప్రదాయ వ్యవసాయానికే స్వాగతం పలుకు తున్నారు. ఆరోగ్య జీవనం కోసం – ఆరోగ్యమైన తిండి ఆరోగ్య మైన పంట- ఆరోగ్యమైన నేల కావాలి. ఈ సత్యాన్ని గ్రహించి సేంద్రియ వ్యవసాయానికి నాంది పలుకుతున్నారు.

సేంద్రియ వ్యవసాయం – నిర్వచనం:

నేలకు సేంద్రియ పదార్ధాలను అందించి అధిక దిగుబడులతో బాటు నాణ్యత గల పంట వుత్పత్తులను పొందడమే “సేంద్రియ వ్యవసాయం”

సేంద్రియ వ్యవసాయం – అవలంబించవలసిన సాగు పద్ధతులు :
  1. అవసరమైనంత మేరకే నేలను దున్ని – నేల కోతను తగ్గించాలి.
  2. వ్యవసాయం అంటే పాడి – పంట – దీన్ని దృష్టి లో పెట్టుకుని పంట టో పాటు పాడి పశువుల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
  3. వృక్ష, జంతు సంబంధ వ్యర్ధాలను అన్నిటినీ సేంద్రియ ఎరువులుగా మార్చి వినియోగించాలి.
  4. అంతర కృషి చేస్తూ కలుపు సకాలం లో తీసి పంటకు తగినంత పోషకాలు అందేటట్లు చూడాలి.
  5. జీవన ఎరువుల ప్రాధాన్యత రైతులకు తెలిపి విరివి గా వాడేటట్లు చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవన ఎరువుల ఉత్పత్తి ఎక్కువ చేసి రైతులకు అందజేయాలి.
  6. నీటి వనరులను సద్వినియోగం చేస్తూ, నేలలోని తేమను పరి రక్షించుటకు తగు సేద్య విధానాలను అవలంబించాలి.
  7. సస్య రక్షణ కు వృక్ష, జంతు సంబంధ మందులను వాడాలి.
  8. జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చి సస్యరక్షణ గావించాలి.
  9. పంట దిగుబడులు తగ్గకుండా, నాణ్యత చెడకుండా, ప్రకృతి ప్రసాదిత వనరుల ను ఉపయోగించుకోవాలి.

సేంద్రియ వ్యవసాయం – లాభాలు:
  1. నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
  2. నేలలో “హ్యూమస్” నిల్వలు పెరిగి అన్ని పోషకాలను పంటలకు అందిస్తుంది.
  3. నేల భౌతిక, రసాయనిక, జీవ పరం గా అభివృద్ధి చెందుతుంది.
  4. నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది.
  5. నీటి నిల్వ సామర్ద్యం , మురుగు నీరు పోవు సౌకర్యం కలుగుతుంది
  6. నేల కాలుష్యం తగ్గి నాణ్యత తో  కూడిన ఉత్పాదకత జరుగుతుంది
  7. భూగర్భ జలాల కాలుష్య నివారణకు దోహద పడుతుంది.
  8. buffering capacity  పెరుగుతుంది
  9. చీడ పీడల బెడద తగ్గుతుంది
  10. వానపాముల అభివృద్ధి కి ఇతోధికం గా సాయ పడుతుంది.
  11. పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుంది
  12. నాణ్యమైన సురక్షిత ఆహారం లభిస్తుంది.
  13. నాణ్యత, నిల్వ వుండే గుణం పెరుగుతుంది.
  14. సుస్థిర సేద్యానికి, రైతు మనో వికాసానికి, దేశ ప్రగతికి మూలమవుతుంది.

సేంద్రియ వ్యవసాయం లో అవరోధాలు:
  1. మొత్తం సాగు భూమికి కావలసిన సేంద్రియ పదార్ధాన్ని సేకరించడం కష్ట సాధ్యం
  2. రైతులకు పశు పోషణ సామర్ధ్యం తగ్గి పశువులను పోషించలేక పోవడం వల్ల సేంద్రియ ఎరువుల తయారీ తగ్గింది.
  3. రైతుల జీవన శైలిలో మార్పు వల్ల సేంద్రియ పదార్ధాల తయారీకి సుముఖం గా ఉండరు.
  4. సేంద్రియ ఎరువుల ప్రభావం మొక్క పెరుగుదలపై ఆశించినంత లేకపోవడం వల్ల రైతులు రసాయనిక ఎరువులపై మొగ్గు చూపిస్తున్నారు.
  5. కౌలు కు చేసే రైతులు సేంద్రియ ఎరువులపై శ్రద్ద చూపరు
  6. అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ లు సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ఆశించిన ఫలితాలు రాక పోవచ్చు
  7. సేంద్రియ ఎరువుల వలన నాణ్యత పెరిగినా దిగుబడులు రసాయనిక ఎరువుల వల్లే పెంచ వచ్చు.
  8. నీటి ఎద్దడి ప్రాంతాల్లో సేంద్రియ ఎరువుల సమీకరణ, సేంద్రియ సేద్యం కష్ట తరమవుతుంది.
  9. సేంద్రియ ఎరువు పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతు దానివైపు మొగ్గు చూపడం  లేదు.

No comments:

Post a Comment