Tuesday, 24 May 2016

పశుగ్రాసము వినియోగము, నిల్వ పద్ధతులు

పశుగ్రాసము వినియోగము, నిల్వ పద్ధతులు
జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటి మేతల కాండములు పెద్దగా లావుగా ఉండుట వలన వాటిని చిన్న ముక్కలుగా నరికి మేపాలి లేని యెడల, మెత్తని భాగము ఆకులు మాత్రమే తిని మిగతాది తొక్కి మల మూత్రాలతో కలిసి 40 శాతం వరకు మేత వృధా అయిపోతుంది. ముక్కలుగా నరికిమేపడం వలన మేత పూర్తిగా సద్వినియోగం అవుతుంది. ముక్కలుగా నరికిన మేతలో, తవుడు, బెల్లపు మద్ది లవణ మిశ్రమము లాంటి అనుబంధ పదార్ధాలు కలిపి పశువులకు మేపుకోవచ్చు, సంచులలో వుంచి కూడా నిలువ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు తప్పని సరిగా పశుగ్రాసాన్ని ముక్కలు చేసి మేపాలి.
పశుగ్రాసము నిల్వ ఉంచే పద్ధతులు :
పశుగ్రాసము పుష్కలంగా లభించే రోజులలో వృధా చేయకుండా నిల్వ చేసుకోవాలి. పశుగ్రాసము నిల్వ చేసుకోవడములో గమనించవలసిన విషయమేమిటంటే మేతలోని పోషక విలువలు సాధ్యమయినంతవరకు తగ్గకుండా చూసుకోవాలి.
నిల్వ చేసే పద్ధతులలో రెండు పద్ధతులు కలవు.
Ø పశుగ్రాసాన్ని ఎండుమేతగా తయారు చేసుకోవడం.
Ø పచ్చి మేతను పాతర వేసుకోవడం ( సైలేజి)
ఎండు మేత నిల్వ చేసుకొనే పద్ధతి:
పశుగ్రాసము కోసిన తర్వాత అందులోని తేమ సాధ్యమయినంత తక్కువ సమయంలో 35 శాతం వరకు తగ్గేటట్లు చూడాలి. ఆ తర్వాత మేతను నీడలో ఆరబెట్టి అందులోని తేమ 15 శాతం వరకు తగ్గించాలి. 15 శాతం తేమ ఉన్న పశుగ్రాసము బూజు పట్టకుండా చెడిపోకుండా నిల్వ చేసుకోవచ్చు. పోషక పదార్దములు కూడ ఎక్కువగా నష్టపోవు.
ఎండు మేతగా నిల్వ చేసుకొనే పశుగ్రాసాన్ని, ఉదయం పూట సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు కోసి ఎండలో తల క్రిందులుగా నిలబెట్టాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు మరలివేస్తుండాలి. దీనివల్ల మేతలోని 70 శాతం తేమ 40 శాతం వరకు తగ్గుతుంది. ఆ తర్వాత నీడలో పరిచి ఆరబెట్టి తేమ శాతము 15 శాతం వరకు తగ్గించాలి. ఇలా ఆరపెట్టేటప్పుడు మేతలోని ఆకులు ఎక్కువగా రాలిపోకుండా చూడడం చాల ముఖ్యం.
పాతర గడ్డి లేదా సైలేజీ చేయు పద్ధతి:
సైలేజీ అనగా పశు గ్రాసమును ఎక్కువగా లభించు సమయములలో, మిగులు మేతను గుంతలలో పాతర వేసి నిలువ చేయుట, మొక్కజొన్న, జొన్న రకాల మేతలు పాతరవేయుటకు ఉపయుక్తమయిన రకములు, చెరుకు ఆకు, ఎన్.బి.21 గడ్డి, బి.ఎన్-2 గడ్డి, పేరా గడ్డి కూడా పనికి వస్తాయి. కాయజాతి పచ్చిమేతలు సైలేజి పాతర వేసుకోవడానికి పనికిరావు. పచ్చిమేత దొరకని సమయములో పచ్చిమేతకు బదులుగా వాడుకోవచ్చు.
సైలేజి రోజుకు పాడి పశువుకు 20 కిలోల చొప్పున యివ్వవచ్చును. సుమారు 120 రోజులకు సరిపడీ పాతర గడ్డి చేతిలో వుంటే వేసవి కాలపు పచ్చిమేత కొరత చాలా వరకు తగ్గిన్చుకోనవచ్చును. 5 పాడి పశువులకు 120 రోజులకు రోజుకు 20 కిలోల చొప్పున (5x12x120) 12000 కిలోల సైలేజి కావాలి. ఈ సైలేజి తయారు చేయడానికి 12000x3/2=18000 కిలోక పచ్చిమేత కావాలి. సుమారు ఒక ఎకరా భూమి నుండి లభించే జొన్న గాని, మొక్కజొన్న గాని అవసరముంటుంది.
15 టన్నుల సైలేజి చేసికొనుటకు పాతర పరిమాణము :
ఒక ఘనపుటడుగు సైలేజి బరువు 15 కిలోలు వుంటుంది. అంటే 1000 ఘనపుటడుగల పాతర కావాలి. 8 అడుగుల వెడల్పు 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవు గల పాతర సరిపోతుంది. సైలేజి పాతర తెరచిన తర్వాత 30 రోజులలో వాడుకోవాలి. కనుక దీనిని 3 భాగాలుగా చేసుకోవాలి. గుంత అడుగు భాగంలో ఏ పరిస్థితిలోను నీరు రాని ప్రదేశంలో గుంత తవ్వాలి.
పాతర నింపే విధానము :
పచ్చిమేతలో 70 - 80 శాతము నీరు వుంటుంది. సైలేజి చేయడానికి 60 శాతము మించి వుండకూడదు. కనుక కోసిన పచ్చిమేతను పొలంలోనే ఆరబెట్టి తేమను తగ్గించవచ్చును. ముక్కలుగా నరికితే మరి కొంత తొందరగా ఆరుతుంది. మరీ లేతగా ఉన్న పచ్చిమేత సైలేజి చేయడానికి పనికి రాదు. మొక్కజొన్న, సజ్జ రకాలను కంకిలో పాలు పట్టి గింజ గట్టిపద్తున్న సమయంలో పాతర వేస్త్రే కమ్మటి సైలేజి తయారు అవుతుంది. కొంత తవుడు గాని జొన్నపిండి, లేదా బెల్లపు మడ్డి రెండు శాతం వరకు పచ్చిమేతతో కలిపినా సైలేజి పులిసిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. తేమ మరీ తక్కువుగా వుంది ఎండ బెట్టిన పచ్చిమేతను పాతర వేస్తే పాతరలోగాలి, ప్రాణవాయువు ఎక్కువగా ఉందిపోయి బూజు పట్టవచ్చు. విపరీతమైన వేడి వాళ్ళ పాతర గడ్డి నిప్పు అంటుకొనే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.
ఈ విషయాలు అన్ని గుర్తు వుంచుకొని పాతర వేయవలసిన గడ్డిని వరుసలలో నింపాలి. భూమిపైన కూడా 2 -3 అడుగులు వచ్చేలా నింపాలి. ప్రతి వరుసకు బాగా త్రొక్కి, గాలి ఏ మాత్రం లేకుండా చూడాలి. పశువులతోను లేదా ట్రాక్టరుతో కూడా త్రోక్కిన్చావచ్చును. మాలిన పదార్దములు గుంతలో పడకుండా చూడాలి. పాతరలలో పచ్చిమేత నింపుట పూర్తి అయిన తరువాత భూమి పైభాగాన ఎత్తుగా వచ్చేలా చూడాలి. దేనిపైన, పనికి రాని గడ్డి లేదా తాటి ఆకులు వేసి కప్పి మీద 4-5 అంగుళాల మందంగా బురద మట్టితో కప్పాలి. క్రమేణా ఇది 2-3 అడుగుల వరకు క్రుంగి పోతుంది. ఈ సమయంలో ఏర్పడే పగుళ్ళను చిక్కటి మట్టి పేడతో కలిపి అలకడం మంచిది.
సైలేజి వాడకం : పాతర వేసిన గడ్డి రెండు నెలలకు మాగి కమ్మటి వాసన గల సైలేజిగా మారుతుంది. తరువాత అవసరాన్ని బట్టి ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2 -3 సంవత్సరాల వరకు చెడిపోకుండా సైలేజిని నిల్వ వుంచుకోవచ్చును. అయితే సైలేజి గుంత తెరచిన తరువాత నెల రోజులలో వాడుకోవలసి వుంటుంది. లేకపోతీ ఆరిపోయి చెడిపోతుంది, బూజు పడుతుంది. మొత్తం కప్పునంతా ఒక్కసారి తీయగూడదు. అలవాటు పడేవరకు పశువులు సైలేజిని తినకపోవచ్చు. పాలు పితికిన తరువాత లేదా పాలు పితకడానికి నాలుగు గంటల ముందు సైలేజిని పశువులకు మేపాలి. లేని యెడల పాలకు సైలేజి వాసన వస్తుంది. పాలు పితికే సమయంలో దగ్గరలో సైలేజి లేకుండా చూడాలి.
వరిగడ్డిలో పశువుకు జీర్ణయోగ్యమైన పోషక పదార్ధాలు చాలా తక్కువ. పశువుకు కావలిసిన మాంసకృత్తులు అసలే లేవు. వరిగడ్డిలో పోషక పదార్ధాల లోపమే కాకుండా, పశువు శరీరంలోని కాల్షియం ధాతువును నష్టపరిచే గుణం కూడా వుంది. దీన్ని సుపోషకం చేసుకోవడం ఆవశ్యకత వుంది.

డాక్టర్.జి.రాంబాబు, M.V.Sc., పశువైద్యాధికారి, కడప.
డాక్టర్.యన్.కృష్ణ ప్రియ, Ph.D(Ag.), వ్యవసాయ విస్తరణ విభాగము, అగ్రికల్చర్ కాలేజి, బాపట్ల.








No comments:

Post a Comment